అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.):అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించే యూనివర్సిటీలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే ర్యాంకింగ్‌లలో యూనివర్సిటీ విభాగంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ 26వ ర్యాంక్ దక్కించుకున్నట్టు ఉపకులపతి డాక్టర్ సారధివర్మ తెలిపారు. శనివారం యూనివర్సిటీ అడ్మినిస్ర్టేటివ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా ప్రణాళిక, మౌలిక వసతులు, నాణ్యత నైపుణ్యం వంటి ప్రమాణాలు, పరిశోధనా ప్రాజెక్ట్సు, ప్లేస్‌మెంట్స్, పీహెచ్‌డి పొందిన ప్రొఫెసర్స్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ ర్యాంకింగ్స్ ఇస్తారని, ఈ అంశాలలో తమ యూనివర్సిటీ అత్యుత్తమంగా ఉందన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లలో జాతీయ స్థాయిలో 26వ ర్యాంక్, ఇంజనీరింగ్ విభాగంలో 35వ ర్యాంక్, ఓవరాల్ కేటగిరిలో 46వ ర్యాంక్, మేనేజ్‌మెంట్ విభాగంలో 70వ ర్యాంకు వచ్చిందని చెప్పారు. యూనివర్సిటీ నుంచి ప్రతి ఏటా 6200 మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారని, అలాగే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా గత పదిహేడేళ్లుగా 100 శాతం ప్లేస్‌మెంట్స్ సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, ఎంహెచ్‌ఎ్‌స విభాగం డీన్ డాక్టర్ కిషోర్‌బాబు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ