తెలంగాణ, 7 సెప్టెంబర్ (హి.స.)
చంద్ర గ్రహణం సందర్భంగా తెలంగాణలోని వివిధ ఆలయాలు మూసివేశారు.
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం తలుపులు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ అధికారులు మూసి వేశారు. సోమవారం తెల్లవారు జాము 3 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరువనున్నారు. ఇక సుప్రభాత సేవ అనంతరం ఆలయ సుద్ది, ప్రక్షాలన నిర్వహిస్తారు.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. ఆదివారం ఉదయం 11.25 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం గ్రహణ మోక్ష అనంతరం వేకువజామున 3.45 గంటలకు ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతఃకాల పూజలు అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు అనుమతించనున్నట్లు అర్చకులు తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని అధికారులు మూసివేశారు. సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం ఉదయం 8:15 గంటల నుండి దర్శనాలు పునరుద్ధరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు