తెలంగాణ, హనుమకొండ. 7 సెప్టెంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు నమ్మించి మోసం చేసే నయవంచకులే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా విమర్శలు చేశారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పరిధి ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రెండవ విడత రైతన్న కోసం రాజన్న పాదయాత్ర చేస్తుండగా ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ తనతో తిరిగిన వారేనని గ్రామాల్లో అనుకునే విధంగా తుపాకీ రామన్న, పిట్టల దొర మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులను యూరియా విషయంలో అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు కాకపోవడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేశామని ప్రజలు ఇప్పుడు తండ్లాడు తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు