హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ లో వినాయక ప్రతిమల
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసినట్లు నగర కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 10 రోజుల్లో లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. రెండ్రోజుల్లో ఒక్క ట్యాంక్ బండ్ పైనే 25 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు తెలిపారు. మరో 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని, వాటిని మధ్యాహ్నం 2 గంటల్లోగా నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈసారి నగరంలో వినాయక విగ్రహాల ఎత్తు అధికంగా ఉందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలకు విద్యుత్ వైర్లు తాకడంతో ఊరేగింపులో ఆటంకాలు ఏర్పడ్డాయని తెలిపారు. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయని, కొందరు వ్యక్తులు గొడవలు పడగా.. 5 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..