అమరావతి, 7 సెప్టెంబర్ (హి.స.)
ఇంద్రకీలాద్రిపై ఈ దసరా వేడుకల్లో ఆర్జిత సేవలు, కుంకుమార్చన సహా అన్ని పూజలకు సంబంధించి.. కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దసరాలో అమ్మ వారి ఆర్జిత సేవలు, లక్ష కుంకుమార్చన పూజల్లో వేల మంది భక్తులు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటారు. ఇదే సమయంలో విదేశాలు, దూర ప్రాంతాల్లో ఉండే భక్తులు.. టిక్కెట్లను కొనుగోలు చేసి పరోక్షంగా పూజల్లో పాల్గొంటున్నారు. ఈసారి ఈ పరోక్ష ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలను ప్రత్యక్ష సేవలతో పోలిస్తే గణనీయంగా తగ్గించనున్నారు. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. దీంతో దూరప్రాంతాల నుంచి మరింత ఎక్కువ మంది భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ