న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.): ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతున్న తరుణంలో భాజపా నాయకత్వం ఆ పార్టీ ఎంపీలకోసం ఆదివారం పార్లమెంటు ఆవరణలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు భాజపాకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలంతా పాల్గొన్నారు. మోదీ సాధారణ ఎంపీ తరహాలో చివరి వరుసలో కూర్చొని సీనియర్ నేతలు చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకించారు. జీఎస్టీ రేట్లు తగ్గించి సామాన్యులకు ఊరట కల్పించినందుకు ఎంపీలు ఆయన్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. ఎంపీల ప్రశంసలను వినమ్రంగా స్వీకరిస్తూ.. తాను కూడా అందరిలానే సాధారణ కార్యకర్తనని ప్రధాని తెలిపారు. సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకోవడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంపై దృష్టి సారించాలని ఎంపీలకు సీనియర్ నేతలు సూచించారు. రెండు రోజులు జరిగే ఈ వర్క్‌షాప్‌లో సోమవారం ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ