కర్నూలు, 8 సెప్టెంబర్ (హి.స.)భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ మతంలో తమలపాకు (పాన్) కు శుభప్రదమైన స్థానం ఉంది. అలాగే.. ఇది ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో, వివాహాల వంటి శుభకార్యాలలో, పూజా కార్యక్రమాలలో ప్రధానంగా ఉపయోగిస్తారు. తమలపాకులు ఆతిథ్యానికి, సామాజిక అనుబంధానికి చిహ్నంగా, అలాగే నైతిక నిబద్ధతను సూచించడానికి కూడా పరిగణిస్తారు.. అందుకే.. ప్రతి శుభ సందర్భంలోనూ తమలపాకు ఉండాల్సిందే.. ఇంకా చాలామంది వక్కలు, సున్నంతో పాన్ ను ఇష్టంగా తింటారు.. తమలపాకులో ఎన్నో పోషకాలతోపాటు ఔషధ గుణాలు పుష్కలంగా దాగున్నాయి.. తమలపాకులో కాల్షియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడతాయి.. తమలపాకు దగ్గు, శ్లేష్మం తగ్గించడంలో సహాయపడే ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇంకా ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఈ ఆకులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తాయి..
అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. తమలపాకులో సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ – యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను కొంతవరకు నిరోధించడంలో తమలపాకు సహాయపడుతుందని అనేక పరిశోధనలు కనుగొన్నాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, దుర్వాసన వంటి సాధారణ సమస్యలకు ఆయుర్వేదంలో శతాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు.
కడుపు సమస్యలు దూరం..
అంతేకాకుండా, జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడానికి కూడా తమలపాకులను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది కడుపులోని ఆమ్లతను నియంత్రిస్తుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
దుర్వాసనను తొలగిపోతుంది..
తమలపాకులను నమలడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది.. శ్వాస తాజాగా మారుతుంది. ఎందుకంటే దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. తమలపాకును భోజనం చేసిన తర్వాత తీసుకుంటే.. సహజ మౌత్ ఫ్రెషనర్‌గా చేస్తుంది. తమలపాకులలో లభించే విటమిన్ సి – ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇంకా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.
ఇంట్లోనే తమలపాకు తీగను పెంచుకోండి..
ఇంట్లో తమలపాకు తీగను నాటడం చాలా సులభం.. ఎందుకంటే దానికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు.. దీనిని బాల్కనీ, వరండా లేదా ఇంటి నీడ గోడ దగ్గర సులభంగా నాటవచ్చు. దీని తీగ నెమ్మదిగా పెరుగుతుంది.. రెయిలింగ్ లేదా గోడపై వ్యాపిస్తుంది.. ఇంటికి అందమైన సహజ అలంకరణను ఇస్తుంది.
తమలపాకు తీగ విత్తనాల నుంచి కాదు.. తీగ కొమ్మల నుండి పెరుగుతుంది. ఆవు పేడ ఎరువు లేదా కంపోస్ట్ కలిపిన కొద్దిగా తేమతో కూడిన నేలలో 5-6 అంగుళాల పొడవు గల కొమ్మను నాటండి. దానికి నీరు పోయండి.. వేసవిలో, ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి రక్షించండి.. తేమను నిర్వహించడానికి ఆకులపై తేలికగా పిచికారీ చేస్తూ ఉండండి. శీతాకాలంలో, తక్కువ నీరు పెట్టండి.. కానీ నేల పూర్తిగా ఎండిపోనివ్వవద్దు. కీటకాలు ఆకులపై దాడి చేస్తే, వేప నీరు లేదా ఇంట్లో తయారుచేసిన పురుగుమందును పిచికారీ చేయండి..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి