అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)
లిక్కర్ స్కామ్‌లో సిట్ తవ్వే కొద్దీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారులు, పాత్రధారుల జాబితా అమాంతం పెరిగిపోతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ పాపకు సొమ్ములో ఎందరికో వాటా ఉంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ ‘అంతులేని కథ’లా సాగుతోంది.
మరో నలుగురు కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్టు సిట్ తాజా విచారణలో ఆధారాలు లభించినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలకనేత మేనల్లుడు, గోదావరి జిల్లాల్లో టీడీఆర్ బాండ్లంటే గుర్తొచ్చే మాజీ మంత్రి, గుంటూరు జిల్లాలో మాటకారి నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి, ఉమ్మడి అనంతలో ‘మార్నింగ్ స్టార్’ మాజీ ఎమ్మెల్యే భారీగా లిక్కర్ సొమ్ములు దండుకున్నట్టు సమాచారం.
మరి కొంతమంది వైసీపీ నేతలూ అందినకాడికి దోచుకున్నారు. మద్యం సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టర్లతో పాటు హాలో గ్రామ్ కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ, మ్యాన్ పవర్ ఏజెన్సీల నుంచి సొమ్ములు పిండుకున్నారు. ప్రతి నెలా కనీసం పది లక్షలకు తగ్గకుండా పాతిక లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ