న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.) భారత్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం గమనార్హం. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే అని వెల్లడించారు. అయితే, ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని మోడీ తియాంజెన్‌లో చైనా అధినేత జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి వేదిక పంచుకోవడంపై జెలెన్‌స్కీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, అలాస్కాలో డొనాల్డ్ ట్రంప్- పుతిన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ట్ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరించే వారిపై కూడా ఈ ఆంక్షలు అమలు చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ