
ఢిల్లీ.,02 జనవరి (హి.స.) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌ఈఓ) అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో డీఆర్‌డీఓ అంకితభావం, వృత్తి నిబద్ధతకు ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. డీఆర్‌డీఓ 68వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ భద్రతా కవచమైన ‘సుదర్శన చక్ర’ తయారీ వెనుక డీఆర్‌డీఓ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
సుదర్శన చక్ర మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ రక్షణ కవచం మనకు అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. 2025లో ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘మిషన్ సుదర్శన్ చక్ర’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా గగనతల రక్షణ కోసం బలమైన వ్యవస్థను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా కీలకమన్న సంగతిని ఆపరేషన్ సిందూర్ సమయంలో అందరూ గుర్తించినట్లు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ