
ఢిల్లీ.,03జనవరి (హి.స.) దేశీయంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టులో చివరి పర్వత సొరంగం తవ్వకం పనులు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం పూర్తయ్యాయి. ఈ తవ్వకం తుది ఘట్టాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు. తాజాగా తవ్వకం పూర్తయిన సొరంగం పొడవు 1.5 కిలోమీటర్లు. ముంబయి, అహ్మదాబాద్‌లను అనుసంధానించేలా చేపట్టిన 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో విరార్, బొయీసర్ స్టేషన్ల మధ్య ఇది ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 పర్వత సొరంగాలు ఉండగా, వాటిలో 7 మహారాష్ట్రలోనే ఉన్నాయి.
మరోవైపు- కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక వ్యవస్థలో డేటా సెంటర్లకు, రైల్వేకు ఇంధన అవసరాలు తీర్చడంలో చిన్న, మాడ్యులార్ అణు రియాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని అశ్వినీ వైష్ణవ్ దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ తెలిపారు. వాటిని సాకారం చేసేందుకు.. ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన ‘శాంతి’ బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. నౌకలను నడిపేందుకు ఉపయోగించే 15-30 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రాలను రైల్వే కార్యకలాపాలకు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ