
తిరుపతి, 06 జనవరి (హి.స.)తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఇష్టంలేదన్నందుకు ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్‌లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ చేసే సమయంలో లక్ష్మి అనే మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి.. బతుకుదెరువు కోసం భర్త, కొడుకుతో కలిసి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వలస వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సమోసా దుకాణంలో లక్ష్మి పనిచేస్తోంది.
ఈ క్రమంలోనే వివాహేతర సంబంధాన్ని ఇకపై కొనసాగించలేనని, తనను ఇబ్బంది పెట్టవద్దని సోమశేఖర్ ను లక్ష్మి కోరింది. దీంతో చివరిసారి మాట్లాడుకుందామని సోమశేఖర్ ఆమెను తన గదికి పిలిచాడు.
సోమవారం మాట్లాడేందుకు వెళ్లిన లక్ష్మిపై సోమశేఖర్ దాడి చేశాడు. ఇంట్లోని కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. ఆపై ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV