
నెల్లూరు, 01 అక్టోబర్ (హి.స.)
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565పై బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లికి చెందిన షేక్ రసూల్ బాషా (47), మణికల సుధాకర్ (45) పెయింట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈరోజు (గురువారం) చింతలపాలెం గ్రామంలో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో రసూల్, సుధాకర్ మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ