
హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.) మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. షాబాద్ పోలీసులు, చేవెళ్ల జోన్ ఎస్ఓటీ బృందం సంయుక్తంగా నిర్వహించిన రహస్య ఆపరేషన్లో 13.97 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 9న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు షాబాద్ లోని నాగర్కుంట చౌరస్తా సమీపంలోని టీ-టైమ్ వద్ద తనిఖీలు నిర్వహించి మారమ్ వంశీ రెడ్డి (23), బీరా ప్రవీణ్ కుమార్ (28)లను పట్టుకున్నారు.
వీరిద్దరూ మీర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వారు. వారి నుంచి డ్రగ్స్ పాటు రెండు రెడ్మి మొబైల్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో బెంగళూరుకు చెందిన స్టీఫెన్ అనే వ్యక్తి వద్ద గ్రాముకు రూ.3 వేల చొప్పున సుమారు 14 గ్రాముల ఎండీఎంఏను రూ.42 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని మోకిల, కోకాపేట, నానక్రామ్లూడ ప్రాంతాల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయించేందుకు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
ప్రధాన నిందితుడిగా పేర్కొన్న స్టీఫెన్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు, డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం-1985లోని సెక్షన్ 8(సి) రెడ్విత్ 22(సి) కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..