
హైదరాబాద్ , 10 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీఓ నంబర్ 59 కింద వచ్చిన పెండింగ్ దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ భూముల్లో నివాస నిర్మాణాలు చేపట్టిన కుటుంబాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ సమస్యలు అనేక ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం కొందరు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఈ నేపథ్యంలో పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరించడంతోపాటు, అర్హత లేని దరఖాస్తులకు అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఈ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం. 500 చదరపు గజాల వరకు ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి జీఓ 59 కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
దరఖాస్తుదారుల హక్కులు, భూమి స్వభావం, సంబంధిత రికార్డులు, ఇప్పటికే ఉన్న న్యాయపరమైన వివాదాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. భూ రికార్డుల్లో తేడాలు లేదా అక్రమాలు బయటపడితే, చట్టపరమైన నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్