
హైదరాబాద్ , 10 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మూడు బ్యారేజీలకు మరమ్మతులు చేపట్టేందుకు సుమారు రూ.2,100 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని ఈ బ్యారేజీల సమస్యలు గత రెండేళ్లకు పైగా చర్చనీయాంశంగా కొనసాగుతున్నాయి. వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి సాంకేతిక పరిశీలనలు, నిర్మాణ పరిస్థితుల అంచనా, అవసరమైన మరమ్మతుల రూపకల్పన వంటి పనులు కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను వేగవంతం చేయాలని భావిస్తోంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం, మొత్తం వ్యయంలో సుమారు రూ.1,800 కోట్లు డయాఫ్రాగమ్ గోడల నిర్మాణానికి అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
మిగిలిన సుమారు రూ.300 కోట్లను ఇతర అనుబంధ పనులకు వినియోగించే అవకాశం ఉంది. వీటిలో బ్యారేజీల దిగువ భాగాల్లో నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించే నిర్మాణాల బలోపేతం, స్టిల్లింగ్ బేసిన్ల విస్తరణ వంటి పనులు ఉన్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద స్టిల్లింగ్ బేసిన్ను సుమారు 60 మీటర్ల వరకు విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద 45 నుంచి 50 మీటర్ల మేర విస్తరణ అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, తుది రూపకల్పన, సాంకేతిక పరిశీలనల అనంతరమే ఈ వివరాల్లో మార్పులు ఉండవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అక్టోబర్ 12న ఢిల్లీలో జరిగే సాంకేతిక పర్యవేక్షణ కమిటీ సమావేశం ఈ విషయంలో కీలకంగా మారనుంది. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థకు చెందిన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతుల ప్రణాళికలు, డిజైన్లు, పరిశోధన నివేదికలను పరిశీలించనున్నారు. మరమ్మతుల పనులను నవంబర్ మధ్యలో ప్రారంభించి, 2027 జూన్ మధ్య నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్