ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Mla


హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)

ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి, ప్రస్తుతం బీజేపీ పాలనలో నెలకొన్నాయని తాము ఆరోపిస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులకు మధ్య పోలికలు ఉన్నాయని సుధీర్రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేస్తూ, ప్రశ్నించే గొంతులను నిరోధిస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపే యువతను నిర్బంధించే చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

తెలంగాణ నుంచి తమ హక్కుల కోసం వెళ్లిన విద్యార్థులను భోపాల్లో నిర్బంధించడం వంటి ఘటనలు శాంతియుత నిరసన తెలిపే హక్కుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొంటూ, అరెస్టు చేసిన విద్యార్థులు తమ తమ రాష్ట్రాలకు క్షేమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande