
హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.) సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ కేంద్రం ద్వారా మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమయ్యేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడుల అనుసంధానం తదితర అంశాల్లో ఎంఎస్ఎంఈలకు మార్గనిర్దేశం చేస్తామన్నారు.
లఘు ఉద్యోగ్ భారతి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో శనివారం నిర్వహించిన ఎల్ యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈలు లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో ఈ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
దేశంలోనే తొలిసారిగా ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. క్షేత్రస్థాయిలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలు చూపించేందుకు నెలకోసారి ప్రత్యేకంగా గ్రీవెన్స్ డేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు