
ఖమ్మం, 10 అక్టోబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రూ.4.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండు నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.
ఇందులో రూ. 2.42 కోట్ల అంచనా వ్యయంతో పోలేపల్లి నుంచి దానవాయిగూడెం వరకు, రూ. 2.20 కోట్ల అంచనా వ్యయంతో పోలేపల్లి నుంచి రామునిపేట వరకు బీటీ రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా అందిస్తున్నామన్నారు.
అర్హులైన ప్రతి పేదవానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూల్ లో స్థల సమస్య ఉన్నందున, సమీపంలో అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నూతన స్కూల్ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..