
పాకాల , 10 అక్టోబర్ (హి.స.)ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడపడానికి సముద్రంలో స్నానానికి దిగిన యువకులు బలమైన అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన యువకులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలలో కొందరిని ఒడ్డుకు చేర్చగలిగారు.
అయితే తీవ్రంగా అస్వస్థతకు గురైన యువకులను తక్షణ చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందారని ధ్రువీకరించారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గల్లంతైన మిగిలిన యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సెలవు దినాల్లో బీచ్ల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్