
అమరావతి , 10 అక్టోబర్ (హి.స.)పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తున్నట్లు వార్తలు రావడం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ పరిణామంపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే అటవీశాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. పులి జాడను కనుగొనేందుకు అవసరమైన అన్ని ఆధునిక సాంకేతిక పరికరాలను, ట్రాప్ కెమెరాలను ఉపయోగించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి సమయాలలో పొలాల వైపు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 'హనుమాన్' ప్రత్యేక రెస్క్యూ బృందాలను, అనుభవజ్ఞులైన అటవీ సిబ్బందిని సంఘటన స్థలానికి రప్పించారు. పులి సురక్షితంగా బంధించే వరకు ప్రజలు సంయమనం పాటించాలని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. స్థానిక ప్రజలకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్