
శ్రీశైలం,, 12 అక్టోబర్ (హి.స.) దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీశైలంలో ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం భ్రమరాంబికా అమ్మవారు బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ రోజు ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, చండీహోమం, పంచాక్షరీ, చతుర్వేద పారాయణాలు, కుమారిపూజలు నిర్వహించారు.
మల్లికార్జునస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రపారాయణాలు చేశారు. కుమారి పూజల్లో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం మయూరవాహనంపై బ్రహ్మచారిణి అలంకరణలో అమ్మవారు, మల్లికార్జున స్వామి శ్రీశైలం వీధుల్లో విహరించారు. సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు.
దేవిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు (సోమవారం) రాత్రికి మయూర వాహనంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV