
కొత్త ఢిల్లీ, అక్టోబర్ 14 (హి.స):
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా మరియు ఉపాధి ఆధారితంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆ రాష్ట్ర ఉన్నత విద్య రాష్ట్ర మంత్రి రజనీ తివారీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నకలు మాఫియాపై సమర్థవంతమైన అడ్డుకట్ట వేశామని, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో జాతీయ విద్యా విధానం-2020 (NEP) కి అనుగుణంగా మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతిభావంతులైన మహిళా విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందించే పథకంపై వేగంగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ ఉన్నత విద్య రాష్ట్ర మంత్రి మరియు హర్దోయ్ జిల్లాలోని షాహాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రజనీ తివారీ 'హిందుస్థాన్ సమాచారం'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉన్నత విద్యలో సంస్కరణలు, విద్యార్థినుల విద్య, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రతిపక్షాల రాజకీయాలు మరియు షాహాబాద్ అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. గతంలో ఏ మండలాల్లో అయితే విశ్వవిద్యాలయాలు లేవో, అక్కడ కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామని, దీనివల్ల విద్యార్థినులు ఉన్నత విద్య కోసం చాలా దూరాలకు వెళ్లాల్సిన అవసరం తప్పిందని ఆమె స్పష్టం చేశారు.
ఉన్నత విద్య సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రభుత్వం అత్యంత పారదర్శకమైన విధానం ద్వారా భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టిందని తెలిపారు. మిగిలిన ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందని చెప్పారు. జాతీయ విద్యా విధానం-2020 ప్రధాన ఉద్దేశం విద్యను భారతీయ సంస్కృతి, ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం మరియు యువతకు ఉపాధి అవకాశాలను మరింత పెంచడమేనని ఆమె వివరించారు.
కళాశాలల్లో డిజిటల్ లైబ్రరీలు మరియు డిజిటల్ పార్కులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దడానికి బడ్జెట్ను క్రమంగా పెంచుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి విద్యార్థికి చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నకలు రాయడానికి రాజకీయ అండదండలు ఉండేవని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పరీక్షలు ఇప్పుడు ఎటువంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల యువతలో విశ్వాసం పెరిగిందని, గ్లోబల్ పోటీని ఎదుర్కొనేలా వారిని తయారు చేస్తున్నామని చెప్పారు.
శాంతిభద్రతల మెరుగుదల మరియు ప్రభుత్వ పథకాల అమలు కారణంగా అమ్మాయిలు చదువు మధ్యలోనే మానేసే శాతం (డ్రాపౌట్ రేట్) గణనీయంగా తగ్గిందని తెలిపారు. విద్యార్థినులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశామని, ప్రతిభ గల విద్యార్థినులకు స్కూటీలు అందించే పథకం కూడా అమల్లో ఉందని చెప్పారు. మహిళా డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత కొందరు విద్యార్థులు ఉన్నత విద్యలో చేరకపోవడానికి లేదా మొదటి సంవత్సరం తర్వాత చదువు ఆపేయడానికి గల కారణాలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తోందని, తద్వారా వాటికి తగిన పరిష్కారాలు కనుగొంటున్నామని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల అంశంపై ఆమె ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ బిల్లు) పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరి బట్టబయలైందని అన్నారు. ప్రతిపక్షాల రాజకీయాలను, వాటి అసలు స్వరూపాన్ని మహిళలు ఇప్పడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ అనుసరిస్తున్న 'పీడీఏ' (PDA) ఫార్ములాపై స్పందిస్తూ.. ప్రతిపక్షాలకు సరైన సిద్ధాంతం, నిర్దిష్ట విధానం, స్పష్టమైన దృక్పథం లేవని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఎటువంటి వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తోందని, ప్రజలు ఇప్పుడు కేవలం నినాదాల రాజకీయాలకు దూరంగా ఆలోచిస్తున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi