
న్యూఢిల్లీ:
, 14 అక్టోబర్ (హి.స.)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల కుటుంబాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వేగంగా అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మోసపూరిత ఏజెంట్ల వలలో చిక్కుకుని రష్యా ఆర్మీలో చేరిన భారతీయులను సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడంతో పాటు, మరణించిన వారి కుటుంబాలకు దక్కాల్సిన ఆర్థిక సహాయం మరియు పరిహారం శీఘ్రంగా చెల్లించేలా రష్యా అధికారులతో చర్చలు జరపాలని కోర్టు పేర్కొంది.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ మరియు మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న చర్యల పురోగతిని సమీక్షించింది. బాధితుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభను అనుభవిస్తున్నాయని, అందువల్ల పరిహార ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు స్పందిస్తూ.. మోసపూరిత నెట్వర్క్లను అరికట్టడానికి ఇప్పటికే సీబీఐ విచారణ వేగవంతం చేశామని, రష్యాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా బాధితులకు తగిన సహాయం అందిస్తున్నామని కోర్టుకు తెలిపారు. రష్యా సైన్యం నుండి భారతీయుల డిశ్చార్జ్ ప్రక్రియతో పాటు, నష్టపరిహారం త్వరగా అందేలా దౌత్యపరమైన మార్గాల్లో చొరవ చూపుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi