
విజయవాడ, 14 అక్టోబర్ (హి.స.)ఆశ్వయుజ మాసం రాగానే విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తజనసందోహంతో నిండి పోతుంది. దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారి దర్శనం కోసం భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు.
ఈరోజు (బుధవారం) శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.పూర్వం అసుర శక్తి విజృంభించిన సమయంలో అసుర సంహారం కోసం, దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి అనే త్రిశక్తి స్వరూపంగా శ్రీ మహా చండీ అమ్మవారు ఆవిర్భవించారు. అనంతరం శ్రీ మహా చండీ దేవి రాక్షసులను దునుమాడి అసుర శక్తి నుంచి దేవతలను రక్షించి అభయమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జగన్మాత ధరించి ఈ మహా చండీ దేవి అవతార విశిష్టత. శ్రీ మహా చండీ దేవి అవతారం దేవిని దర్శించుకునేందుకు ఇవాళ ఉదయం నుంచి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.
నేడు ఆశ్వీయుజ శుద్ధ పంచమి పర్వదినం కావడంతో.. శ్రీ మహాచండి యాగం, పారాయణం చేస్తారు. అలాగే పులగం ను నైవేద్యంగా సమర్పించి.. భక్తులకు అందజేస్తారు. మహాచండి అమ్మవారిని పూజించిన వారికి దైహిక, మానసిక శక్తి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని నమ్ముతారు.ఈ రోజు మహాచండీ అలంకరణలో ఉన్న అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపదిముర్మ దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ఆలయానికి రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV