
హైదరాబాద్ , 16 అక్టోబర్ (హి.స.)పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలకమైన అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్ర ఆసుపత్రులు మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యవసర వైద్య విభాగాలు (Emergency Wards), అత్యాధునిక ఐసీయూ పడకలు మరియు ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వెంటిలేటర్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నగరాలకు రోగులు వెళ్లే రద్దడిని తగ్గించేందుకు.. జిల్లా ఆసుపత్రుల్లోనే నిపుణులైన డాక్టర్లు, సర్జన్ల సేవలను విస్తృతం చేశారు. ప్రసూతి మరియు శిశు సంరక్షణ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, రోగ నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైన అత్యాధునిక డయాగ్నొస్టిక్ పరికరాలను అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు మంజూరు చేస్తున్నారు.
వైద్య సిబ్బంది విధులకు హాజరయ్యే తీరును పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని కఠినతరం చేశారు. మందుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, ప్రతి ఆసుపత్రిలోనూ అవసరమైన ప్రాథమిక మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్