
అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక పాలన వ్యవస్థకు కీలకంగా నిలవనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 9,829 ఎంపీటీసీ స్థానాలు, 659 జడ్పీటీసీ స్థానాలు కలిపి మొత్తం 10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ 659 మండలాలకు సంబంధించినది. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 నుంచి 23 వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించింది.
అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 25న అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 27 వరకు అవకాశం కల్పించారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా స్పష్టమవుతుంది.
పోలింగ్ నవంబర్ 3న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ చేపట్టే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 5న జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్