
హైదరాబాద్ , 20 అక్టోబర్ (హి.స.)జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ పారా గేమ్స్‌లో తెలంగాణకు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజి అద్భుత విజయాన్ని అందుకున్నారు. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, కొత్త గేమ్స్ రికార్డును నెలకొల్పి దేశానికి గర్వకారణంగా నిలిచారు. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్ పోటీలో ఆమె కేవలం 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ పోటీలో జపాన్‌కు చెందిన నీనా కన్నో 58.92 సెకన్లతో రజత పతకం సాధించగా, అదే దేశానికి చెందిన అకానే కటో 1 నిమిషం 0.26 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నారు. వీరిని వెనక్కి నెట్టి దీప్తి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సాధించిన టైమింగ్‌ను మెరుగుపరుచుకుంటూ తన ప్రతిభను మరోసారి అంతర్జాతీయ వేదికపై చాటారు.
వరంగల్ ప్రాంతానికి చెందిన దీప్తి చిన్నప్పటి నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అథ్లెటిక్స్‌లో ముందుకు సాగారు. ఆమె ప్రతిభను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ ఎన్. రమేశ్ శిక్షణ అందించారు. క్రమశిక్షణ, నిరంతర సాధనతో దీప్తి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
2023 ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 400 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన ఆమె, 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకం సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
తాజాగా మరోసారి ఏషియన్ పారా గేమ్స్‌లో స్వర్ణం గెలవడంతో తెలంగాణలో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్