సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ: న్యాయస్థానంలో పిటిషన్ ఉపసంహరణ!
సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ: న్యాయస్థానంలో పిటిషన్ ఉపసంహరణ!
Abhijith Deepke,CJP leader


ఢిల్లీ, 21 అక్టోబర్ (హి.స.)

సీజేపీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తమ జ్యుడీషియల్ కస్టడీని సవాల్ చేస్తూ వారు ఉన్నత కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం నుంచి కీలక ప్రశ్నలు ఎదురుకావడంతో, వారు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ధర్మాసనం.. చట్టబద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండగా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించింది. పూచీకత్తుల తిరస్కరణ విషయమై బీఎన్‌ఎస్‌ఎస్ (BNSS) సెక్షన్ 414 కింద అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉండగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో గతంలో సమర్పించిన బాండ్ల నిబంధనలను ఆ ఇద్దరు నేతలు ఉల్లంఘించారనే అంశాన్ని కోర్టు ప్రస్తావించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని గతంలో ఇచ్చిన హామీని పక్కనపెట్టి, మళ్లీ నిరోధక చర్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కఠినంగా వ్యవహరించడం సమంజసమేనని అభిప్రాయపడింది.

కోర్టు లేవనెత్తిన ఈ సాంకేతిక, చట్టపరమైన అభ్యంతరాల నేపథ్యంలో.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా తరఫు న్యాయవాదులు స్వచ్ఛందంగా తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వివాదంపై న్యాయస్థానంలో తదుపరి వాదనలకు తెరపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande