
హైదరాబాద్ , 23 అక్టోబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు, సుమారు 200 కిలోమీటర్లకు పైగా పొడవు ఉండే దక్షిణ భాగం (Southern Stretch) నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు, అలైన్మెంట్ మరియు భూసేకరణ పనులను పర్యవేక్షించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్జీసీఎల్ (HGCL - Hyderabad Growth Corridor Limited) సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 20 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఔటర్ రింగు రోడ్డును ఏ విధంగా అయితే విజయవంతంగా నిర్మించారో, అదే రీతిలో దక్షిణ భాగాన్ని కూడా అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టే దిశగా అధికారిక చర్యలు వేగవంతం చేశారు. భూసేకరణ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించి, చుట్టుపక్కల ప్రాంతాల కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్