
సీవాన్, 24 అక్టోబర్ (హి.స.)
బీహార్‌లోని సీవాన్ జిల్లాలో ఒక ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలిపోగా, ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు కార్మికులు ఉన్నారు.
దీపావళి పండుగ సమీపిస్తుండటంతోజిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అమీరుద్దీన్ మియాన్ అనే వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున బాణాసంచా తయారీ ప్రక్రియ సాగుతోంది. శుక్రవారం సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఒక్కసారిగా అక్కడ నిల్వ ఉంచిన గన్‌పౌడర్, బాణాసంచాకు మంటలు అంటుకున్నాయి. దీంతో వరసగా భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే, భవనం ముందు భాగం ముక్కలై మలబంతా రహదారిపై పడిపోయింది. మృతుల శరీర భాగాలు కూడా గాల్లోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ ప్రకాష్ మీనా, ఎస్పీ భరత్ సోని నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు జరిపిన గాలింపు చర్యల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, రాత్రి వేళ చీకటి కావడం మరియు కూలిపోయిన భవనం లోపల అక్కడక్కడా చిన్నపాటి పేలుళ్లు ఇంకా కొనసాగుతుండటంతో రాత్రి 10 గంటల సమయంలో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం నుండి మళ్లీ డ్రోన్ల సహాయంతో శిథిలాలను క్లియర్ చేస్తూ మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఈ భారీ ప్రమాదంపై సీవాన్ ఎస్పీ తీవ్రంగా స్పందించారు. నివాస ప్రాంతంలో అక్రమంగా బాణాసంచా తయారీ కేంద్రం నడుస్తున్నా నిఘా పెట్టడంలో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ధీరజ్ కుమార్‌తో పాటు ఒక స్థానిక చౌకీదార్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. మహారాజ్‌గంజ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నేతృత్వంలో ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi