
న్యూఢిల్లీ:, 25 అక్టోబర్ (హి.స.)
ఈశాన్య భారతదేశంలో విస్తరిస్తున్న అక్రమ మత్తు పదార్థాల నెట్‌వర్క్ (నార్కో-కార్టెల్) పై భద్రతా బలగాలు చేపట్టిన భారీ చర్యల అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మత్తు పదార్థాల రవాణాదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మత్తు పదార్థాల రవాణా, అక్రమ వ్యాపారాలను ఎంతటివారైనా సహించేది లేదని, దేశాన్ని మత్తు పదార్థ రహితంగా మార్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
హోంశాఖ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇతర కేంద్ర బలగాలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో ఉమ్మడిగా దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా సాగుతున్న అక్రమ రవాణా శృంఖలాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా ఛేదించాయి.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం మత్తు పదార్థాల పట్ల 'జీరో టాలరెన్స్' (సహించేదే లేదు) విధానాన్ని కఠినంగా అమలు చేస్తోందని గుర్తుచేశారు. ఈశాన్య భారతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటమే తమ ప్రాధాన్యత అని తెలిపారు. సరిహద్దుల గుండా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడే ఎంతటి వారిపై అయినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆస్తిపాస్తుల జప్తుతో పాటు తీవ్రమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రవాణా ద్వారా వచ్చే డబ్బును విద్రోహ చర్యలకు ఉపయోగిస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు కేంద్ర, రాష్ట్రాల ఏజెన్సీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని హోంమంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi