
హైదరాబాద్ , 25 అక్టోబర్ (హి.స.)
పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే ఎనిమిది నుంచి పది నెలల పాటు రాష్ట్రంలో తీవ్రమైన వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. భానుడి తాపంతో వర్షపాతం తగ్గడంతో పాటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగే సూచనలు ఉన్నందున, రాష్ట్ర ప్రజలందరూ నీరు, విద్యుత్‌ను ఎంతో బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే కాలంలో నీటి లభ్యత తగ్గడం, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
పడిపోతున్న నీటి నిల్వలు - తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పడిపోతుండటంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న నీటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. నీటి కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపించడంతో సాగునీటి కంటే ముందస్తుగా ప్రజల తాగునీటి అవసరాలకే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు.
ఇంటింటా నీటి వృధాను అరికట్టాలని, తోటలకు లేదా వాహనాలు కడగడానికి మంచినీటిని వాడకూడదని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యుత్ పొదుపు చర్యలు - సౌర విద్యుత్‌పై దృష్టి
ఎండల తీవ్రత పెరిగే కొద్దీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అన్నింటిలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతీ పౌరుడు ఆదా విధానాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రారంభించి ప్రైవేటు సంస్థల వరకు పగటి వేళల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగాన్ని పరిమితం చేయాలని, అనవసరమైన లైట్లు, విద్యుత్ పరికరాలను ఆపివేయాలని సూచించారు. విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి సోలార్ (సౌర) విద్యుత్ ఉత్పత్తిని విస్తృతం చేయాలని, ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహన
ఎల్‌నినో వల్ల కలిగే దుష్ప్రభావాలు, వనరుల పొదుపు ప్రాధాన్యతపై గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. టెలివిజన్లు, సినిమా థియేటర్లు, సాంస్కృతిక బృందాల ద్వారా నీటిని ఆదా చేయండి - విద్యుత్‌ను కాపాడండి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని, ప్రభుత్వం విధించే మార్గదర్శకాలను స్వచ్ఛందంగా పాటిస్తూ సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్