ఏడుపాయలకు భక్తుల తాకిడి.. వనదుర్గమ్మ దర్శనానికి బారులు
నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏడుపాయల


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వనదుర్గమ్మ దర్శనం కోసం ఏడుపాయలకు చేరుకున్నారు.

ఆలయ అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో వనదుర్గాదేవిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం ఎదురుగా ఉన్న మంజీరా నదీ పాయతో పాటు చెక్డ్యామ్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనo కోసం బారులు తీరారు. మరికొందరు భక్తులు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు సమర్పించగా, పలువురు ఓడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఏడుపాయల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande