గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజుసమీక్ష
తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు.
CS


హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ సంస్థలకు ఆహ్వానాలు పంపడం, సన్నాహక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఆయన అధికారులతో చర్చించినట్లు సమాచారం.

గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఎల్లుండి ఢిల్లీలో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న వ్యాపార అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉండనుంది.

గ్లోబల్ సమ్మిట్కు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలోని 1,500కు పైగా సంస్థలను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంతో పాటు పారిశ్రామిక రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇదే సమయంలో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ నిర్వహించనున్న రక్షా ఎక్స్పోకు 100కు పైగా డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఈ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, పరిశ్రమల విస్తరణకు అవకాశాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించనున్నారు. సమ్మిట్ ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande