
అమరావతి / హైదరాబాద్:, 28 అక్టోబర్ (హి.స.)
అత్యంత తీవ్రరూపం దాల్చిన 'ఆర్నబ్' తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో తీవ్ర వినాశనాన్ని మిగిల్చింది. యానాం, కాకినాడ, కోనసీమ పరిసర ప్రాంతాల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రధాన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని తీరప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ కష్ట సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారాన్ని ప్రకటించింది.
విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరించేందుకు సహాయం చేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో ఫోన్లో మాట్లాడారు. ఏపీలో తలెత్తిన అత్యవసర పరిస్థితిని వివరించి, అదనపు సిబ్బందిని మరియు అవసరమైన పరికరాలను పంపాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, కావలసిన సాంకేతిక బృందాలను, సామగ్రిని తక్షణమే పంపించేందుకు అంగీకరించింది.
సిబ్బంది, సామగ్రితో ఏపీకి బయలుదేరిన ప్రత్యేక బృందాలు
తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి అనుభవజ్ఞులైన ఇంజనీర్లు, లైన్మెన్లు, సాంకేతిక సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు బయలుదేరారు. తెగిపడిన కరెంట్ తీగలను బాగుచేయడం, విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, నిలిచిపోయిన సబ్స్టేషన్లను పునఃప్రారంభించడంలో ఈ బృందాలు ఏపీ అధికారులకు అండగా నిలవనున్నాయి.
మరోవైపు, తుఫాను ప్రభావిత జిల్లాల్లోని ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, పునరావాస కేంద్రాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ల సాయంతో అత్యవసర సరఫరా అందిస్తున్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ అందించిన ఈ సమయానుకూల సాయంతో కోస్తాంధ్రలోని ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi