
అనకాపల్లి , 28 అక్టోబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత పర్యటించారు. వాతావరణ పరిస్థితులు, తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా చిన్నగుమ్ములూరులో స్థానిక ప్రజలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడంపై దృష్టి సారించిన హోంమంత్రి, పునరావాస కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, ఇతర అవసరాలు సక్రమంగా అందుతున్నాయా అని తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, మాడుగుల మండల పరిధిలోని పెద్దేరు జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో నీటి నిల్వ అధికమైంది. ఈ నేపథ్యంలో జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. నీటి విడుదల కారణంగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మాడుగుల, బుచ్చెయ్యపేట, చోడవరం, రాంబిల్లి మండలాల ప్రజలు నదులు, వాగులు, నీటి ప్రవాహ ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. అవసరం లేకుండా వరద నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్