
అనకాపల్లి:, 28 అక్టోబర్ (హి.స.)
'ఆర్నబ్' తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లాలోని పెద్దేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం భారీగా పెరిగింది. జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి ఉధృతంగా నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో జలవనరుల శాఖ అధికారులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రిజర్వాయర్ గేట్లను ఎత్తి దిగువకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ పరిణామంపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్పందిస్తూ జలాశయం దిగువ ప్రాంత నివాసితులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మాడుగుల మండలంలోని పోతనపూడి, వి.వి. అగ్రహారం గ్రామాల ప్రజలతో పాటు అనకాపల్లి మండలంలోని తగరంపూడి, వెంకుపాలెం, సీతానగరం, తుంపాల, సత్యనారాయణపురం, కొత్తూరు గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదులు, వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నందున ఎవరూ నీటి ప్రవాహాల సమీపానికి వెళ్లవద్దని, పశువులను మేపేందుకు తీసుకెళ్లకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంత ప్రజల రక్షణకు ప్రాధాన్యమిస్తూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi