
హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు భద్రతా తనిఖీల సమయంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి చేతి లగేజీలో సజీవ బుల్లెట్ లభించడం భద్రతా సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాస్ పొంది సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్దకు వెళ్లిన సమయంలో సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది ఎక్స్‌రే స్కానర్ ద్వారా లగేజీని తనిఖీ చేయగా బ్యాగులో బుల్లెట్ ఉన్నట్లు స్పష్టంగా గుర్తించారు.
వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ పోలీసులకు అతడిని అప్పగించి సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తికి లైసెన్స్ కలిగిన ఆయుధం ఉందా లేదా చట్టవిరుద్ధంగా బుల్లెట్‌ను తీసుకెళ్తున్నాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రయాణికుడు పొరపాటున బ్యాగులో బుల్లెట్ ఉండిపోయిందని చెబుతున్నప్పటికీ, భద్రతా ప్రమాణాల దృష్ట్యా సమగ్ర విచారణ ముగిసేవరకు అతడిని ప్రయాణానికి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్