
హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ సైనిక్ పురి పరిధిలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలపై ఈగల్ ఫోర్స్ మరియు కుషాయిగూడ పోలీసులు ఉమ్మడిగా విరుచుకుపడ్డారు. పక్కా సమాచారంతో సైనిక్ పురిలోని 'ది స్మోక్ షాప్' పై దాడి చేసిన అధికారులు అక్కడ రహస్యంగా సాగుతున్న ఈ-సిగరెట్ల దందాను రట్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి 39 అత్యాధునిక ఈ-సిగరెట్లను, లావాదేవీలకు వాడిన స్కానర్‌ను, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో యువకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ-సిగరెట్ల వినియోగం యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ కొందరు వ్యాపారులు బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వీటిని నగరానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించి, ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటూ కొరియర్ల ద్వారా డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, చట్టాన్ని ఉల్లంఘించే షాపుల అనుమతులను రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్