సికింద్రాబాద్ మారేడ్పల్లి భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు: కిలో బంగారం, రూ.15 లక్షల నగదు స్వాధీనం
సికింద్రాబాద్ మారేడ్పల్లి కొండారెడ్డి నగర్లోని ఒక ప్రముఖ వైద్య దంపతుల ఇంట్లో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును హైదరాబాద్ పోలీసులు ఈరోజు విజయవంతంగా ఛేదించారు.
Police


హైదరాబాద్ , 27 అక్టోబర్ (హి.స.)

సికింద్రాబాద్ మారేడ్పల్లి కొండారెడ్డి నగర్లోని ఒక ప్రముఖ వైద్య దంపతుల ఇంట్లో ఇటీవల జరిగిన భారీ దొంగతనం కేసును హైదరాబాద్ పోలీసులు ఈరోజు విజయవంతంగా ఛేదించారు. ఈ దాడులకు సంబంధించి ప్రధాన నిందితుడిని పెద్దఅంబర్పేట ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలను, రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఇల్లు తాళం వేసి వెళ్లిన సమయాన్ని అనువుగా మలుచుకున్న నిందితుడు భరత్, పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి ఈ చోరీకి ఒడిగట్టాడు.

ఈ కేసు నమోదు చేసుకున్న ప్రత్యేక పోలీసు బృందాలు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడి కదలికలను కనిపెట్టాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతడి తాజా లొకేషన్ను పెద్దఅంబర్పేటగా గుర్తించి మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా పలు చోరీ కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని, నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై నిఘా మరింత కఠినతరం చేశామని పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande