
అమరావతి:, 28 అక్టోబర్ (హి.స.)
తీవ్ర తుఫాను 'ఆర్నబ్' యానాం సమీపంలో తీరం దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వేకువజామున ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రంతా అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితులను పర్యవేక్షించిన ఆయన, ఉదయం 6:15 గంటలకే ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తు నిర్వహణ అధికారులతో మళ్లీ మాట్లాడారు.
సమీక్షలో భాగంలో ఆర్టీజీఎస్ అధికారులు తుఫాన్ వివరాలను తెలియజేశారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రమాదం ఇంకా పూర్తిగా సమసిపోలేదని, యంత్రాంగం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ప్రజల ప్రాణ నష్టం జరగకుండా చర్యలు - సీఎం కీలక ఆదేశాలుటెలికాన్ఫరెన్స్ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
వర్షాల కారణంగా కోస్తా జిల్లాల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) వచ్చే అవకాశం ఉన్నందున వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుఫాన్ ధాటికి ఇప్పటికే 84 వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారం, మంచినీరు, పాలు, వైద్య సదుపాయాలు నిరంతరాయంగా అందేలా చూడాలని, .పెనుగాలుల వల్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధప్రాతిపదికన తొలగించి ప్రధాన రహదారుల్లో రవాణా సౌకర్యాన్ని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితి పూర్తిగా తొలగిపోయే వరకు కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లోనే ఉండాలి. సెల్ టవర్లు దెబ్బతిన్న చోట ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలను అందుబాటులో ఉంచాలి అంటూ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. .
సహాయక దళాల సేవలు - ప్రజలకు విజ్ఞప్తి
సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సముద్రంలో వేట పూర్తిగా నిషేధించబడినందున మత్స్యకారులు ఎవరూ తీరానికి వెళ్లవద్దని సూచించారు.
ప్రజలు కూడా కొన్ని గంటల పాటు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, అత్యవసర సాయం కోసం కేటాయించిన టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi