తుపాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అర్నబ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chandrababu


అమరావతి , 28 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బాధితులకు సకాలంలో సహాయం అందిస్తూ, దెబ్బతిన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి రాత్రంతా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడి తాజా వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు కూడా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

తుపాను కారణంగా రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం, దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడం, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించడం వంటి పనులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాగునీరు, ఇతర నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.

ప్రభావిత ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande