గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
సుమారు నాలుగు కిలోల ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
Ganja


భద్రాద్రి కొత్తగూడెం, 28 అక్టోబర్ (హి.స.) సుమారు నాలుగు కిలోల ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలోని సీతారామ కెనాల్ వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. ద్విచక్ర వాహనంపై 4.1 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎక్సైజ్ సీఐ కె. నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం సీతారామ కెనాల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద గంజాయిని గుర్తించారు. వారి నుంచి 4.1 కిలోల ఎండు గంజాయితో పాటు హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande