
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ఢిల్లీలో జరిగే ర్యాలీకి తెలంగాణ నుంచి కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు నిరాకరించడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నాయని తెలంగాణ పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
దక్షిణాది నాయకులు ఢిల్లీ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఢిల్లీకి వెళ్లి ర్యాలీలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
ప్రత్యేక రైళ్లను నిరాకరించినంత మాత్రాన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గబోవని తెలిపారు. గత రెండు, మూడు నెలలుగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగే ర్యాలీకి తెలంగాణ నుంచి కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించాలని ఎంపీలు అనిల్ యాదవ్, మల్లు రవి రైల్వే జనరల్ మేనేజర్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని విమర్శించారు. ఆరు రోజుల పాటు కాలయాపన చేసిన రైల్వే అధికారులు, చివరి నిమిషంలో ప్రత్యేక రైళ్లు కేటాయించడం సాధ్యం కాదని చెప్పారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీ ర్యాలీకి కార్యకర్తలను తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో అవాంతరాలు ఎదురైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఢిల్లీకి చేరుకుంటామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు