
అమరావతి , 28 అక్టోబర్ (హి.స.)
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం, 143 చోట్ల అతిభారీ వర్షాలు, మరో 205 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తీరప్రాంత జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారాయి.
అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురం, విశాఖపట్నం జిల్లా ముడసర్లోవలో 25.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా తాడి, పరవాడ ప్రాంతాల్లో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, సోమలింగంపాలెం, అచ్యుతాపురంలో 23.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో 23.6 సెంటీమీటర్లు, చామలపల్లెలో 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా వేపాడలో 22.7 సెంటీమీటర్లు, విశాఖ జిల్లా పద్మనాభపురంలో 22.5 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెంలో 22.4 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా కొత్తవలసలో 22.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తుపాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, అధికారుల సూచనలు పాటించడం అవసరం. వర్షపాతం అధికంగా నమోదయ్యే ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కీలకంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్