
హైదరాబాద్ , 28 అక్టోబర్ (హి.స.)
అర్నబ్ తుపాను ప్రభావంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలను అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శంషాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం నగరాలకు నడవాల్సిన విమాన సర్వీసులను నిలిపివేశారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా విమానాలను రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు విమానాల రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వర్షాలు, గాలుల తీవ్రత తగ్గిన తర్వాతే తదుపరి విమాన సర్వీసుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడుపుతామని అధికారులు స్పష్టం చేశారు.
విమాన ప్రయాణానికి సిద్ధమవుతున్న ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన సర్వీసుల తాజా వివరాలను సంబంధిత విమానయాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. రద్దులు, సమయ మార్పులపై సమాచారం తీసుకున్న తర్వాతే ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్