
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
బిఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను, గృహ నిర్బంధాలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు హాజరుకాకుండా అడ్డుకోవడాన్ని, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వంటి సీనియర్ నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును, ప్రజల తరఫున మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకోవడం పక్కనబెట్టి, మూసీ ప్రక్షాళన పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు