ఎల్నినో, కరవు పరిస్థితులపై సచివాలయంలో అఖిలపక్ష భేటీ
తెలంగాణలో ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది.
CONGRESS


హైదరాబాద్ , 28 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలో ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల వ్యవసాయం, తాగునీటి సరఫరా, ప్రజల జీవనంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేతలు వినోద్ కుమార్, నిరంజన్రెడ్డి, ఎల్. రమణ హాజరయ్యారు.

రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడితే వర్షపాతంపై ఎలాంటి ప్రభావం ఉండవచ్చనే అంశంతో పాటు, కరవు ముప్పును ముందుగానే అంచనా వేసి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. నీటి వనరుల నిర్వహణ, రైతులకు అవసరమైన సహాయం, తాగునీటి కొరత నివారణ వంటి అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, ప్రతిపక్షాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై ఈ సమావేశం దృష్టి సారించింది. చర్చల అనంతరం ఎలాంటి సూచనలు, నిర్ణయాలు వెలువడతాయనేది ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande