నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.329 కోట్ల చెల్లింపులు
రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా భారీగా నిధులు విడుదలయ్యాయి.
Doctors


అమరావతి , 28 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా భారీగా నిధులు విడుదలయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఆస్పత్రులకు మొత్తం రూ.329 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు ట్రస్ట్ సీఈవో వెల్లడించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల ద్వారా ఆస్పత్రులకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.

ట్రస్ట్ విడుదల చేసిన నిధుల్లో వివిధ విభాగాలకు చెందిన ఆస్పత్రులకు కేటాయింపులు చేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పరిధిలోని అనుబంధ ఆస్పత్రులకు రూ.50 కోట్లు చెల్లించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు రూ.122.64 కోట్లు విడుదల చేశారు. అలాగే ప్రాధాన్య ఆస్పత్రులకు రూ.12.54 కోట్లను చెల్లించినట్లు సీఈవో వివరించారు.

వీటితోపాటు బిల్లు డిస్కౌంట్ పథకం కింద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అదనంగా రూ.144 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఈ చెల్లింపులతో కలిపి ప్రస్తుత నెలలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు అందించిన మొత్తం నిధులు రూ.329 కోట్లకు చేరుకున్నాయని స్పష్టం చేశారు.

వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు జరగడం వల్ల వాటి నిర్వహణకు అవసరమైన నిధులు సమకూరనున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద చికిత్స పొందే రోగులకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు ఈ చెల్లింపులు దోహదపడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande